కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ జీతాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీస్ శాఖలో గతంలో మరణించిన ఉద్యోగుల వివరాలను అడ్డు పెట్టుకుని, నకిలీ అకౌంట్ల ద్వారా సుమారు ఒక కోటి నలబై లక్షల రూపాయల (రూ. 1,40,18,308/-) ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఏసీపీ (టాస్క్ ఫోర్స్) వాసాల సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ I-టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కుంభకోణం జరిగిందిలా..
కరీంనగర్ సిటీ పోలీస్ కమిషనరేట్ సిపి కార్యాలయంలోని పే సెక్షన్‌లో గతంలో పనిచేసిన నీలం రామ్మోహన్ (హెడ్ కానిస్టేబుల్) , ప్రస్తుతం చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతను తన విధుల్లో భాగంగా గతంలో మరణించిన ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్ల (సి.హెచ్. రవీందర్, కె. గంగస్వామి, కె. రవి) ఎంప్లాయీ ఐడీలను (Employee IDs) సేకరించాడు. వీరి పేర్లకు బదులుగా లావుడియా రవి, గంగరాజు చుక్కా, శంకర్ నామతాబాబ్ అనే ప్రయివేట్ ముగ్గురు వ్యక్తుల పేర్లతో కరీంనగర్‌లోని భగత్ నగర్, బొమ్మకల్ హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ బ్రాంచీలలో నకిలీ ఖాతాలను సృష్టించాడు. ఈ ఖాతాలకు తన సొంత ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లను లింక్ చేసి జూన్ 2022 నుండి మార్చి 2026 వరకు ప్రతి నెలా నిబంధనలకు విరుద్ధంగా జీతాలు జమ అయ్యేలా పన్నాగం పన్నాడు.
విచారణలో తేలిన కీలక అంశాలు:
నకిలీ ఖాతాల్లో జమ అయిన డబ్బును రామ్మోహన్ ఏటీఎంల ద్వారా డ్రా చేయడమే కాకుండా, తన వ్యక్తిగత ఖాతాలకు IMPS ద్వారా మళ్లించుకున్నాడు. ఈ నకిలీ జీతాల ఖాతాలపై లోన్లు కూడా పొంది, ప్రభుత్వ సొమ్ము నుండే ఈఎంఐలు (EMIs) చెల్లించబడేలా సెట్టింగ్ చేసుకున్నాడు. ఈ కుట్రలో నీలం రామ్మోహన్(52)తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) వై.వి. ముని రామయ్య(61) , కరీంనగర్ కు చెందిన ప్రైవేట్ వ్యక్తులు ముగ్గురు లావుడియా రవి(42)(వాచ్ మన్), చుక్కా గంగరాజు (33) (ప్రయివేట్ డైలీ డ్రైవర్), మరియు శంకర్ నామతాబాబ్(46) (మటన్ షాప్ కీపర్) సహకరించినట్లు విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
ముఖ్య నిందితుల అరెస్ట్, రిమాండ్:
ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ప్రధాన సూత్రధారి అయిన హెడ్ కానిస్టేబుల్ నీలం రామ్మోహన్ తో పాటు, అతనికి సహకరించిన రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) వై.వి. ముని రామయ్య, మరియు నకిలీ ఖాతాల సృష్టిలో భాగస్వాములైన ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు లావుడియా రవి(42)(వాచ్ మన్), చుక్కా గంగరాజు (33) (ప్రయివేట్ డైలీ డ్రైవర్), మరియు శంకర్ నామతాబాబ్(46) (మటన్ షాప్ కీపర్)లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నామన్నారు. ఈ మేరకు నీలం రాం మోహన్ నుంచి బంగారు ఆభరణాలు మొత్తం బరువు 344.1 గ్రాములు, నగదు రూ.50 వేలు , మునిరామయ్య నుంచి ఒక మొబైల్ ఫోన్, ప్రభుత్వ సిమ్ కార్డు, రూ.18 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఇటీవల జీతాల చెల్లింపుల్లో అనుమానాస్పద లావాదేవీలను గమనించిన పోలీసు కమిషనర్ గౌష్ ఆలం దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏసీపీ టాస్క్ ఫోర్స్ వాసాలా సతీష్ ను ఆదేశించారు. విచారణలో రికార్డులను తారుమారు చేసి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారి మళ్లించి, నమ్మకద్రోహానికి పాల్పడిన నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో లోతైన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సీపీ తెలిపారు. పోలీసు అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని, అక్రమాలకు పాల్పడి పట్టుబడితే వారిపై కఠినమైన క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.

