Mobile Popup Ad
Mobile Popup Ad

నిషేధిత పొగాకు ఉత్పత్తులపై కరీంనగర్ పోలీసుల ఉక్కుపాదం

కలం, కరీంనగర్ బ్యూరో: మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) ఉక్కుపాదం మోపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న పాన్ షాపులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 99 పాన్ షాపులను పరిశీలించగా, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు తదితర వస్తువులను విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

తనిఖీల సందర్భంగా పోలీసు స్టేషన్ల వారీగా, కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసులు, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు, కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు, వీణవంక పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు నమోదు చేశారు. మొత్తం 99 పాన్ షాపులను తనిఖీ చేసి, నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు విక్రయిస్తున్న వారిపై 52 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Gaush Alam) మాట్లాడుతూ.. యువతను మాదకద్రవ్యాలు, హానికరమైన పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా కాపాడేందుకు పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో నిషేధిత వస్తువుల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇలాంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, నిషేధిత వస్తువుల విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని సీపీ గౌష్ ఆలం కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>