మహిళల జీవితాల్లో కాంగ్రెస్ మిగిల్చిన చీకటి రోజు : యాదగిరి సునీల్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: భారత దేశ చరిత్రలో 17 ఏప్రిల్, 2026 మహిళల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన ఒక చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ (Karimnagar)లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1996 సంవత్సరం అప్పటి ప్రధాన మంత్రి దేవెగౌడ్ పరిపాలనలో మహిళ బిల్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ఆనాడు వ్యతిరేకం చేసి బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ అని మండిపడ్డారు. 1998, 1999, 2002, 2003లో అటల్ బిహారీ వాజ్ పాయ్ బిల్లు ప్రవేశపెడితే… అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వాటి మిత్ర పక్షాలు అడ్డుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాల కాలం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వాటి మిత్రపక్షాలు మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్నాయని ధ్వజమెత్తారు.

2010 కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు రాజ్యసభ లో బిల్లు తీసుకొస్తే పూర్తి స్థాయిలో బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేసి లోక్ సభకు బిల్లు రాకుండా కాంగ్రెస్ అడ్డుకుందని నిప్పులు చెరిగారు. 2023 లో మళ్లీ ప్రధాన మంత్రి మోడి లోక్ సభలో బిల్లును పాస్ చేయిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా హస్తం పార్టీ కుట్రలు చేసిందన్నారు. అప్పుడు కొంత మంది కాంగ్రెస్ నాయకులు మహిళలకు రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటే పార్టీ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని యాదగిరి సునీల్ రావు గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోదీ 2029లో మహిళలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని, శుక్రవారం తిరిగి మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారన్నారు. అయితే, చర్చలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను అడ్డుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నాటి నుండి నేటి వరకు మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన లేని పార్టీ అని నిప్పులు చెరిగారు. రాబోయే 10 సంవత్సరాల వరకు మహిళలకు రిజర్వేషన్ లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వారి మిత్ర పక్షాలు భవిష్యత్తులో మహిళల చేతిలో ఘోరమైన పరాజయం లభిస్తుందని హెచ్చరించారు. రిజర్వేషన్ బిల్లును అడ్డుకొకుంటే తెలంగాణ రాష్ట్రం నుండి చట్టసభలకు దాదాపు 60 మంది శాసనసభ్యులు వచ్చేవారని వివరించారు. రాబోయే రోజుల్లో మోదీ 2/3 మెజారిటీ సంపాదించి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కార్పోరేటర్లు చొప్పరి జయశ్రీ, కర్రె పద్మ, ఎన్నం లక్ష్మి, వేముల కవిత, వొంటెల సత్యనారాయణ, బండ రమణ రెడ్డి, మాసం గణేష్, మ్యాకల వెంకటేష్, గాజె శివరాం, పొన్నం మొండయ్య, కొలిపాక శ్రీనివాస్, కన్న క`ష్ణ, బిజెపి నాయకులు వెంకటరెడ్డి, పండుగ నాగరాజు, శివకుమార్, భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>