కలం, కరీంనగర్ బ్యూరో: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు మధ్య నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఆదివారం కమిషనరేట్ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణ (Karimnagar Ganesh Festival), భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ (Karimnagar CP Gaush Alam) మాట్లాడూతూ.. ముఖ్యమైన భద్రతా మార్గదర్శకాలను వెల్లడించారు.
సీసీ కెమెరాల నిఘా:
కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ద్వారా నగరంలోని ముఖ్య కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు నిమజ్జన మార్గాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు.
మండపాల వద్ద జాగ్రత్తలు:
ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాలంటీర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటూ పోలీసులకు సహకరించాలని, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల బోర్డులను మండపాల వద్ద ప్రదర్శించాలని ఆదేశించారు.
ఘాట్ల వద్ద పటిష్ట బందోబస్తు:
మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్ దీపాలు మరియు గజ ఈతగాళ్లను (స్విమ్మర్లు) సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ నివారింపు:
విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు రూట్ మ్యాప్‌ను అమలు చేస్తున్నామని, అడ్డంకిగా ఉన్న విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలను తొలగించినట్లు పేర్కొన్నారు.
వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు:
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, అవాస్తవాలు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100/112’ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో విజయవంతం చేయాలని కమిషనర్ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు.

