కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని డీఎస్పీ(Nirmal DSP Srinivas) శ్రీనివాస్ సూచించారు. ఆదివారం నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖకు నిర్వాహకులు సహకరించాలని తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ సమ్మయ్యతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

