కలం, రాజన్న సిరిసిల్ల: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని శుద్ధి చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి (BJP Leader Reddaboina Gopi) మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశమంతటికీ స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే కొనసాగిందని గుర్తుచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పం, నాయకత్వంలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ ద్వారా నిజాం లొంగిపోవడంతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే..
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నాయని గోపి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని కేవలం విలీన దినోత్సవంగా మార్చి చరిత్రను మరుగున పరిచే ప్రయత్నం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పయనిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పటేల్ వంటి మహనీయుల త్యాగాలను భావితరాలకు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, లింగంపల్లి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మీ, శీలం రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గొప్పడి సురేందర్ రావు, అధికార ప్రతినిధులు నవీన్ యాదవ్, రాజాసింగ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి, సర్పంచ్ రాగుల రాజు రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సాబీర్, ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామ్ ప్రసాద్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండ నరేష్, ఉరవకొండ రాజు, మెరుగు శ్రీనివాస్, వంగల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

