కలం, మహబూబ్ నగర్ బ్యూరో: శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project) బ్యాక్ వాటర్‌ను ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలసంఘం భేటీలో అభ్యంతరం చెప్పింది. అయినా జల దోపిడీ మాత్రం ఆపడం లేదని విమర్శిస్తోంది. ఈ నెల ఏడో తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇదే విషయమై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పిత్తి చేస్తుండటంతో నీరు వృథాగా పోతోందనేది ఏపీ ప్రభుత్వం వాదన.
తెలంగాణ వాదన ఇదీ..
దీన్ని తెలంగాణ అధికారులు తిప్పి కొట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించారని గుర్తు చేశారు. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కిందకు వెళ్లే నీరు నాగార్జునసాగర్‌లో చేరుతుందన్నారు. అక్కడ నీటిని ఏఎంఆర్ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తాగునీటి అవసరాల కోసమే ఉంచాలంటూ పట్టుబట్టింది.
34 టీఎంసీలకు పైగానే..
కేంద్ర జల సంఘం భేటీలో పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేస్తున్న జల దోపిడీని ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఒప్పందం ప్రకారం, ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలు మాత్రమే వాడుకోవాలి. ఇందులో 19 టీఎంసీలు చెన్నై తాగునీటి అవసరాలు, మిగతా 15 టీఎంసీల నీటిని ఏపీ తాగు, సాగు నీరు అవసరాలకు వాడుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 34 టీఎంసీలకు పైగా మళ్లించేసిందని తెలంగాణ వాదిస్తోంది.
తాగు నీటి అవసరాల కోసమని..
వాస్తవానికి పెన్నా బేసిన్ రిజర్వాయర్లలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుమారు 100 టీఎంసీల నీటిని నింపి పెట్టుకుందని తెలంగాణ కేంద్ర జల సంఘానికి వివరించింది. అలాంటప్పుడు ఏపీకి ఇంకా తాగునీటి అవసరాలు ఉంటాయా? అని వాదించింది. శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీకి ప్రస్తుతం ఒక్క చుక్క కూడా వాడుకునే హక్కు లేదని స్పష్టం చేస్తోంది. ఏపీ వాటా ఇప్పటికే పూర్తయిపోయిందని వివరించింది. అయినా, ఇప్పటికీ పోతిరెడ్డిపాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు, వెలిగొండకు 3,500 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 720 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అలాగే, హంద్రీనీవా సుజల స్రవంతికి 398 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు స్పష్టం చేసింది.

