సర్‌పై ప్రతిపక్షాలది దుష్ప్రచారమే.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్

కలం, కరీంనగర్: కేంద్రం తీసుకువచ్చిన సర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో “ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచక శక్తులను తరిమికొడదాం” (మేధావులతో సంగోష్ఠి) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారంగుల అమర్నాథ్ హాజరయ్యారు. వారితోపాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ… ఓటర్ల జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, సీజేపీ, విచ్ఛిన్నకర శక్తులు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సర్ అనేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదో స్వయంగా చేస్తున్నట్లు, ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పుచేతల్లో ఉన్నట్లు వాళ్ళ మాటల తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.

దేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 12 సార్లు ఎస్ఐఆర్ నిర్వహించగా, అందులో 10 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే జరిగిందని జిల్లా బీజేపీ నాయకులు అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో కేవలం 2 సార్లు మాత్రమే ప్రక్రియ జరిగిందని చెప్పారు. ఓటర్ల జాబితాను ఎలాంటి గందరగోళం లేకుండా, పటిష్టంగా, సులువుగా అర్థమయ్యేలా తయారు చేయడమే ఎలక్షన్ కమిషన్ లక్ష్యమని తెలిపారు. కమిషన్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే సర్ కొనసాగుతోందని తెలిపారు.

దేశంలో గతంలో 95 కోట్లు ఉన్న ఓటర్ల సంఖ్య సర్ ప్రక్రియ ద్వారా 82-83 కోట్లకు చేరినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. కరీంనగర్‌తో పాటు చాలా చోట్ల మున్సిపల్ ఎలక్షన్లలో 60 శాతం ఓటింగ్ కూడా నమోదు కావడం లేదని చెప్పారు. డూప్లికేట్ ఓట్లు ఉండటం, చిరునామాలు మారడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, రెండు మూడేసి చోట్ల ఓట్లు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బండ రమణ రెడ్డి, నాంపల్లి శ్రీనివాస్, పొన్నం మొండయ్య గౌడ్, సౌగాని కొమురయ్య, సాదినేని మణిరాజ్, ఈస్ట్ జోన్ అధ్యక్షురాలు అవుదుర్తి శ్రీనివాస్, వెస్ట్ జోన్ అధ్యక్షురాలు జాడి బాలరెడ్డి, కొత్తపల్లి రూరల్ జోన్ అధ్యక్షురాలు కుంట తిరుపతి, సౌత్ జోన్ అధ్యక్షురాలు బండారి గాయత్రి, రూరల్ జోన్ అధ్యక్షురాలు మదిశేట్టి సంతోష్, సెంట్రల్ జోన్ అధ్యక్షురాలు తణుకు సాయికృష్ణ, బీజేపీ జిల్లా ఆఫీస్ సెక్రటరీ కడార్ల విమల్ కుమార్, బిజెపి నాయకులు, మాజీ సైనికులు, రిటైర్డ్ ఉద్యోగులు, మరియు నగరంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రతిభావంతులైన మేధావులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశంలో అశాంతికి కాంగ్రెస్ కుట్రలు..

అధికారం కోల్పోయిన నిరాశా నిస్పృహలతో కాంగ్రెస్ పార్టీ దేశంలో అశాంతిని సృష్టించేందుకు నిరంతరం కుట్రలు చేస్తోందని స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసేందుకు యత్నిస్తోందని బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు “ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచక శక్తులను తరిమికొడదాం” అనే నినాదంతో ఆదివారం కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, చొప్పదండి నియోజకవర్గాల్లో మేధావులు, ఇన్ఫ్లుయెన్సర్ల సదస్సులు నిర్వహించారు.

రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం: గంగాడి

జమ్మికుంటలో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ సదస్సులో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ వ్యతిరేక శక్తులతో కలిపి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్ నైజమని విమర్శించారు. స్వతంత్రంగా వ్యవహరించే కేంద్ర ఎన్నికల సంఘం, ఎస్ ఐ ఆర్ ప్రక్రియలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అసత్యాలను వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న శరవేగవంతమైన అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగుతోందన్నారు.

సర్ పై కాంగ్రెస్ అనవసర అపోహలు: ఓదెలు

మానకొండూరు, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంచిర్యాల జిల్లా ఇంచార్జి కన్నబోయిన ఓదెలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆమోదంతో, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారమే ఓటర్ల ప్రత్యేక సవరణ (సర్‌) పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు. కేవలం బోగస్, డూప్లికేట్, చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తుంటే… కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రజల్లో కావాలని అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల ఈ అరాచక ప్రచారాన్ని మేధావులు, విద్యావంతులు గ్రామాల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి: అమర్ నాథ్

కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మేధావుల సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఆల్ సెల్స్ కన్వీనర్ సారంగుల అమర్ నాథ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పన్నుతున్న కుట్రల పట్ల మేధావులు ప్రజలను చైతన్యపరచాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శులు మాడ వెంకట్ రెడ్డి, గుజ్జ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఈనుగొండ నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యకులు, గుర్రాల వెంకటరెడ్డి, నరసింహారాజు, సంపత్ రావు, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు రాపాక ప్రవీణ్, తిమ్మాపూర్ మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, మానకొండూరు, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి, భూమళ్ల అనిల్, నాయకులు మియాపురం లక్ష్మీనాచారి, ఎర్రోజు లక్ష్మణ్, బూట్ల శ్రీనివాస్, దూలం కిరణ్ గౌడ్, మొగిలి శ్రీనివాస్ ఆయా నియోజకవర్గాల మండలాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా నాయకులు, వివిధ మోర్ఛాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>