కలం, నిర్మల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమన్వయంతో రూపొందించిన పర్యావరణ పరిరక్షణ, మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన పోస్టర్లను మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జలవనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ముఖ్యంగా పీవోపీ విగ్రహాలు సులభంగా కరగకపోవడం వల్ల చెరువులు, నదులు, ఇతర జలవనరుల్లో కాలుష్యం పెరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల పర్యావరణానికి హాని కలగకుండా సంప్రదాయబద్ధంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించి పూజించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

