కలం, పెద్దపల్లి: జిల్లా మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలం మద్దులపల్లి (Maddulapalli ) గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొట్టె రవీందర్, వార్డు మెంబర్ చకినరపు సంతోష్, రాజక్క, సమ్మక్క తదితర మహిళలు, లాస్మయ్య, కళ్యాణ్, రమేష్, శ్రీధర్, సంతోష్, దేవేందర్, రాజయ్య, ఎర్రయ్య, తిరుపతి తో పాటు సుమారు 100 మంది మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మద్దులపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వానికి బలం చేకూర్చేందుకు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు బీఆర్ఎస్ వైపు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పుట్ట మధూకర్ అన్నారు. గ్రామాల్లో ఎంతమందికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయో ప్రజలు ఆలోచించాలని సూచించారు. మంథనికి ఐటీ కంపెనీలు తీసుకురావడంలో, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించేలా కృషి చేస్తానని, అవసరమైతే తన సొంత ఖర్చుతోనూ సహాయం చేస్తానని తెలిపారు.
కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణ పనులపైనా పుట్ట మధూకర్ విమర్శలు చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో ఆలయాన్ని కూల్చివేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు తీరుపై ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం హామీ అమలు విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని అన్నారు. మద్దులపల్లి గ్రామానికి చెందిన చాకినరపు రవీందర్ కి ఉద్యోగం రాకుండా కేసుల విషయంలో ఇబ్బందులు కల్పించారని పుట్ట మధుకర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాళేశ్వరం ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉంటూ సేవ చేస్తామని తెలిపారు.

