కలం, స్పోర్ట్స్: భారత్-ఇంగ్లండ్ ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు ముందు అందరి చూపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. అతనికి అంతర్జాతీయ అరంగేట్రం దక్కుతుందా అనే చర్చ సాగుతున్న వేళ, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కీలక వ్యాఖ్యలు చేశారు. యువ ఆటగాడిపై అతిగా అంచనాలు పెట్టి ఒత్తిడి తీసుకురావొద్దని ఆయన సూచించారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు భారత జట్టులో చోటు లభించింది. అయినప్పటికీ ఇప్పటివరకు అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు.
ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ (Kapil Dev) మాట్లాడుతూ.. వైభవ్ ఎంతో ప్రతిభావంతుడని ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే అతని గురించి ఇప్పుడే చాలా పెద్దగా మాట్లాడకుండా, కొంత సమయం ఇవ్వడం మంచిదని చెప్పారు. అతను ఇంకా చిన్న వయసులో ఉన్నందున అన్ని విషయాలను అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. వైభవ్‌లో కనిపిస్తున్న సహజ ప్రతిభను కపిల్ దేవ్ ప్రశంసించారు. ప్రతిభ పరంగా చూస్తే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల స్థాయిలో కనిపిస్తున్నాడని చెప్పారు. అయితే టీ20ల్లో చూపిన ప్రతిభను మిగతా ఫార్మాట్లలో కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందని వివరించారు.
భారత జట్టు యాజమాన్యం అతను సిద్ధంగా ఉన్నాడని భావిస్తే అవకాశం ఇవ్వాలని కూడా కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. వయసు కంటే సామర్థ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సచిన్ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారని గుర్తు చేస్తూ, ఆలస్యం చేయడం కూడా సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో వైభవ్ 776 పరుగులు చేసి, 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. ఆ ప్రదర్శనతో భారత్ టీ20 జట్టుతో పాటు ఆసియా క్రీడల జట్టులో కూడా చోటు సంపాదించాడు. అయితే ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో అతనికి అవకాశం రాలేదు.
ఆ సిరీస్‌లో భారత్ 2-0తో ఓడిపోవడం, టాప్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ మరింత పెరిగింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో సిరీస్ ఇంకా సమంగా కొనసాగుతోంది. ఇప్పుడు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే రెండో టీ20పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ అరంగేట్రం దక్కుతుందా లేదా అనేది ప్రధాన చర్చగా మారింది.

