కలం, నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నల్లగొండ (Nalgonda) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి (Kancharla Bhupal Reddy) ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఆయన భారీ నిరసన (BRS Protest) ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. మొత్తం 420 హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇస్తామన్న తులం బంగారం హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామన్న హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, పంటలకు రూ.500 బోనస్ విషయంలోనూ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని భూపాల్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు.
ఈ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతాంగం చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు నల్లగొండ జిల్లాలోని రైతులు, నిరుద్యోగులు, ప్రజలు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కంచర్ల భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.

