కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. 1000 అబద్ధాల దగా పాలన: ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 1,000 రోజుల్లో ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని, ఇది ముమ్మాటికీ 1,000 అబద్ధాల “దగా పాలన” అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి.

420 అడుగుల భారీ ఫ్లెక్సీతో మానవహారం..

ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ, 420 హామీల వైఫల్యాలను సూచిస్తూ రూపొందించిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో మానవహారం, ధర్నా చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాలకు పడ్డ బకాయిలను లెక్కలతో సహా ఆధారాలతో ప్రజల ముందుంచారు. ఎన్నికల సమయంలో డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారెంటీ కార్డులపై తొలి సంతకం చేశారని అన్నారు.  మొదటి నెలలో లేదా 100 రోజుల్లోనే అన్ని పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రసంగించారని గుర్తుచేశారు.

భట్టి కూడా పంపిణీ చేశారు..

అలాగే ప్రచార సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్యారెంటీ కార్డులను ప్రజల ఇళ్లకు స్వయంగా పంపిణీ చేస్తూ, ఈ కార్డులను భద్రంగా దాచుకుంటే అధికారం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను వేదికపై ఎల్ఈడీ స్క్రీన్‌లలో ప్రదర్శించి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేశారు. 1,000 రోజులు గడిచినా హామీలు అమలు కాకపోగా, నేడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముఖంగా “మేము 100 రోజుల్లో అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు, ఐదేళ్లలో చేస్తామన్నాం” అంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మాట మార్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>