కలం, ఖమ్మం బ్యూరో: “కాంగ్రెస్ అంటేనే దగా, మోసం.. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన (BRS Protest) ప్రదర్శనలు చేపట్టింది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని గులాబీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించిందని ఆరోపించారు. రైతుబంధు, రుణమాఫీ సక్రమంగా అందక రైతాంగం అల్లాడుతోందన్నారు. అలాగే సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. విలేకరులకు ఇళ్ల స్థలాల కేటాయింపులోనూ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం పోరాడతాయని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు కొత్తగూడెంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నాయకత్వంలో వేలాదిమంది కార్యకర్తలతో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. కాంగ్రెస్ 420 మోసాలకు ప్రతీకగా 420 మీటర్ల బ్యానర్‌ను ప్రదర్శించారు. రోడ్డుపై భారీ మానవహారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

