కలం, ఆదిలాబాద్: తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజా చైతన్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (Kaloji Narayana Rao Jayanti) వేడుకలను ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ(Adilabad SP) అఖిల్ మహాజన్ (Akhil Mahajan) కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాళోజీ తన కలంతో ప్రజల గొంతుకగా నిలిచారని కొనియాడారు.
తెలంగాణ మట్టి గొప్పతనాన్ని, ప్రజల ఆకాంక్షలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కాళోజీ ఆశయాలు, స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆయన రచనలు, ప్రజా ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

