కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలకమైన రైల్వే ప్రాజెక్టుల (Railway Projects)కు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలోని ఘట్కేసర్ నుంచి కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర మల్టీ ట్రాకింగ్ పనులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రైల్వే ఆధునీకరణతో పాటు భవిష్యత్తులో పెరిగే రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రధాన కారిడార్లలో ట్రాక్‌ల సంఖ్యను పెంచుతున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కవర్ చేస్తూ మొత్తం రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో 5 మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 540 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటినీ 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఈ ఐదు ప్రాజెక్టుల జాబితాలో అరక్కోణం – రేణిగుంట మధ్య 77 కి.మీ మేర 3వ, 4వ లైన్ల నిర్మాణం, వైట్‌ఫీల్డ్ – బంగారపేట్ మధ్య 47 కి.మీ మేర 3వ, 4వ లైన్ల విస్తరణ ఉన్నాయి. అలాగే హోసూర్ – ఓమలూర్ మధ్య 147 కి.మీ, సేలం – కరూర్ – దిండిగల్ మధ్య 159 కి.మీ డబ్లింగ్ పనులతో పాటు ఘట్కేసర్ – కాజీపేట మధ్య 110 కి.మీ మల్టీ ట్రాకింగ్ పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.

