కలం, తెలంగాణ బ్యూరో: సిక్సర్ల మోతకు.. వికెట్ల వేటకు.. రికార్డుల ఆటకు టైమొచ్చింది! నెలరోజులు ఫుల్ జోష్! క్రికెట్ అభిమానులకు పండుగ. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫిబ్రవరి 7న మొదలు.. మార్చి 8న ఫైనల్. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. 55 మ్యాచ్‌లతో హోరెత్తించనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించనుందా? అభిషేక్ శర్మ షేక్ చేయనున్నాడా? తిలక్ వర్మ రఫ్ఫాడిస్తాడా? రో–కో లేని లోటును వీళ్లు భర్తీ చేస్తారా? బుమ్ బుమ్ బుమ్రా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేస్తారా?! ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి ఫేవరేట్ టీమ్స్ పరిస్థితి ఏమిటి?! టీ 20 వరల్డ్ కప్‌పై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం..
10 ఏండ్ల తర్వాత ఆతిథ్యం
టీ20 వరల్డ్ కప్-2026ను ఇండియా, శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం ఇది రెండోసారి. మొదటిసారి 2016లో ఆతిథ్యం ఇచ్చింది. 2021 కప్‌కు ఇండియా ‘అధికారిక హోస్ట్’ అయినప్పటికీ..
కరోనా కారణంగా ఆ టోర్నీ యూఏఈ, ఒమన్‌లో జరిగింది.
30 రోజులు.. 55 మ్యాచ్‌లు
ఈ నెల 7నుంచి మొదలయ్యే టీ 20 వరల్డ్ కప్ లో మొత్తం 55 మ్యాచ్‌లు ఉంటాయి. ఇండియాలో 33 మ్యాచులు ఆడుతారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై వేదికలు కానున్నాయి. శ్రీలంకలో 22 మ్యాచ్‌లు ఆడుతారు. కొలంబోలోని రెండు, కాండీలోని ఒక స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. సెమీ ఫైనల్స్ ముంబై, కోల్‌కతా వేదికగా జరుగుతాయి. ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఒకవేళ శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరితే.. మాత్రం అది కొలంబోలో జరిగే చాన్స్ ఉంది.
20 జట్లు.. 4 గ్రూపులు
20 జట్లు క్రికెట్ సంగ్రామంలో పాల్గొంటున్నాయి. ఈ జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో ఐదు జట్లు ఉంటాయి.ఈ టోర్నీలో ఇటలీ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
గ్రూప్ ఏ: ఇండియా, పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ బీ: ఆస్ట్రేలియా , శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్
గ్రూప్ సీ: ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ
గ్రూప్ డీ: సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, కెనడా , యూఏఈ
టోర్నీ ఫార్మాట్
ప్రతి జట్టు గ్రూప్ స్టేజ్‌లో తన గ్రూప్‌లోని మిగిలిన 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.నాలుగు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 8) సూపర్ 8లోకి వెళ్తాయి. సూపర్ 8 నుంచి టాప్ 4 జట్లు సెమీ ఫైనల్స్‌కు వెళ్తాయి. సెమీస్‌లో గెలిచిన 2 జట్లు ఫైనల్ ఆడుతాయి.
దాయాది పోరు లేనట్టేనా!
పాకిస్తాన్, ఇండియా జట్లు తలపడుతున్నా యంటే అది ముందునుంచే హైవోల్టేజీ మ్యాచ్‌గా హీట్ రాజేస్తుంది. ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌లో తాము ఆడబోమని, ఆ టీమ్‌తో కూడా ఆడబోమంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లను మాత్రమే ఆడుతామని చెప్పింది. షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్ స్టేజీలో భాగంగా ఈ నెల 15న టీమిండియాతో కొలంబో వేదికగా పాకిస్తాన్ ఆడాల్సి ఉంది. దాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ కూడా తెలిపారు. ఇదే జరిగితే.. రూల్స్ ప్రకారం ఇండియాకు 2 పాయింట్లు వస్తాయి.
- ఇండియా, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌కు చేరితే.. షెడ్యూల్ ప్రకారం తుది పోరు అహ్మదాబాద్‌లో జరగాలి. ఆ మ్యాచ్ ఆడేందుకు పాక్ ఒప్పుకున్నా.. ఇండియాలో కాకుండా కొలంబోలో జరగొచ్చు. దాన్నీ నిరాకరిస్తే భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు.
- పాకిస్తాన్ టీమ్ గతంలోనే ఇలాంటి బెదిరింపులు చాలా చేసి చివరి నిమిషంలో ఆడింది. ఈ నెల 15న టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాక్ ప్రకటించినప్పటికీ అప్పటి వరకు ఏదైనా జరగొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
టీమిండియా గెలిస్తే.. ఖాతాలో 3 రికార్డులు!
టీమిండియాకు ఈ టీ20 వరల్డ్ కప్ వెరీ స్పెషల్! ఇప్పటి వరకు ఈ కప్‌ను రెండుసార్లు గెలుచుకున్న జట్లు వెస్టిండీస్, ఇంగ్లండ్, ఇండియా మాత్రమే. ఇందులో ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు విజేతగా నిలవలేదు. ఏ జట్టు కూడా వాళ్ల సొంతగడ్డపై టోర్నీ జరిగినప్పుడు కప్ సాధించలేదు. ఈసారి ఇండియా కప్పు కొడితే మాత్రం.. మూడుసార్లు విజేతగా నిలిచిన చరిత్రతోపాటు వరుసగా రెండుసార్లు కప్ కొట్టిన రికార్డు, సొంత గడ్డపై టోర్నీని గెలుచుకున్న హిస్టరీ సొంతం అవుతుంది.
రికార్డుల జాతర
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన చరిత్ర, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన హిస్టరీ కింగ్ విరాట్ కోహ్లీ పేరు మీదనే ఉంది. 1,292 పరుగులు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. హాఫ్ సెంచరీల విషయంలో కోహ్లీ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (12), డేవిడ్ వార్నర్ (8) ఉన్నారు. అత్యధిక వికెట్లు తీసిన రికార్డు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (50 వికెట్లు) పేరు మీదుంది. 2007 నుంచి 2024 వరకు వరుసగా అన్ని వరల్డ్ కప్ లలో ఆడిన ఆటగాడిగానూ రికార్డుకెక్కాడు.
బంగ్లా సెల్ఫ్ గోల్.. స్కాట్లాండ్కు చాన్స్
ఇండియాలో తమ ప్లేయర్లకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ మ్యాచ్‌లను కూడా శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదని ఐసీసీ నిరాకరించడంతో టోర్నీ నుంచి మొత్తానికి తప్పుకుంటున్నట్లు బంగ్లా ప్రకటించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు (14వ స్థానం) చాన్స్ వచ్చింది.
పాపం.. సఫారీలు!
సౌతాఫ్రికా జట్టు ఇప్పటి వరకు వన్డే, టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. టీ20 వరల్డ్ కప్ (2024)లో ఒకసారి మాత్రమే ఫైనల్‌కు వెళ్లింది. ఇండియా చేతిలో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక వన్డే వరల్డ్ కప్‌లో 5 సార్లు (1992, 1999, 2007, 2015, 2023) సెమీ ఫైనల్స్‌కు వెళ్లి వెనుదిరిగింది. ప్రతిసారి గెలుపు ముంగిట బోల్తా పడటంతో సఫారీలకు ‘చోకర్స్’ అని ముద్రపడింది.
టీ20 పుట్టింది ఇలా..
2002లో బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్ ముగిసిన తర్వాత దాని స్థానంలో కొత్తగా మరొక వన్డే పోటీని నిర్వహించాల్సిన ఆలోచన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు వచ్చింది. ప్రేక్షకుల్లో ఆదరణ పెంచేందుకు, స్పాన్సర్ షిప్‌లను ఆకర్షించేందుకు, యూత్‌లో మరింత క్రికెట్ క్రేజ్‌ను పెంచేందుకు ఆలోచించింది. అందులో భాగంగా ఇన్నింగ్స్‌కు 20 ఓవర్లతో మ్యాచ్ పెట్టాలనుకుంది. అలా 2003 జూన్ 13న ఇంగ్లండ్‌లో కౌంటీ జట్ల మధ్య తొలి టీ20 జరిగింది.
- మొదటి టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌పై భారత్ గెలిచి తొలి టీ20 వరల్డ్ కప్ అందుకుంది.
- 2024లో వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా భారత్ నిలిచింది. ఇందులో ప్రత్యర్థి జట్టు సౌతాఫ్రికా. నాడు డేవిడ్ మిల్లర్ కొట్టిన సిక్సర్‌ను బౌండరీ లైన్ వద్ద భారత ఆటగాడు సూర్యకుమార్ క్యాచ్ పట్టడం ఓ మెమొరబుల్. ఆ క్యాచ్ మ్యాచ్‌ను ఇండియా వైపు టర్న్ చేసింది.
- రెండేండ్లకోసారి జరిగే ఈ టీ20 వరల్డ్ కప్‌లో 2009, 2010లో పదినెలల గ్యాప్ లోనే రెండుసార్లు జరిగింది. దీనికి కారణం ఇతర టోర్నీల షెడ్యూలే. 2010 నుంచి మాత్రం వరుసగా రెండేండ్లకోసారి టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు.
డిఫెండింగ్ ఛాంప్‌గా టీమిండియా
2026 టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగుతున్నది. 2024లో వెస్టిండీస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా, అది కూడా సొంతగడ్డపై ఆడుతుండటంతో ఇండియా ‘హాట్ ఫేవరెట్’గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ టీమ్ లు కూడా ఫేవరేట్ లిస్టులో ఉన్నాయి.
‘రో-కో’ లేకుండానే..!
రో-కో (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ) లేకుండా టీమిండియా జట్టు టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్నది. 2024 జూన్ 29న ఇద్దరూ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన కొద్దిసేపటికే ఇద్దరూ తమ రిటైర్మెంట్ ప్రకటించారు.
కీలక జట్ల బలాబలాలు
టీమిండియాలో అభిషేక్ శర్మను పవర్ ప్లే మాస్టర్స్ అనొచ్చు. 190 ప్లస్ స్ట్రయిక్ రేటుతో దూసుకుపోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు హైదరాబాదీ తిలక్ వర్మ వెన్నెముక. ఏ పిచ్‌పైనైనా యార్కర్లతో బ్యాటర్లను వణికించే బౌలర్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ప్లస్! ఆసీస్‌లో హెడ్, మిచెల్ మార్ష్.. ఇంగ్లండ్‌లో బ్రూక్, ఫిల్ సాల్ట్.. సౌతాఫ్రికాలో డికాక్, స్టబ్స్.. ఆఫ్గనిస్తాన్‌లో రషీద్ ఖాన్, గుర్బాజ్ అద్భుతంగా ఆడుతారు.
Read Also: U19 వరల్డ్ కప్: ఆరోసారి విశ్వవిజేతగా ‘యువ’భారత్!
Follow Us On: Sharechat





