కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణలో నిజాం పరిపాలనకు స్వస్తి పలికి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిన చారిత్రాత్మకమైన రోజు సెప్టెంబర్ 17 అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి, నగర మేయర్ జి.మమత, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని తదితరులు పాల్గొన్నారు.
3.81 కోట్ల మందికి ఉచిత ప్రయాణం..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి జూపల్లి ప్రసంగం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 3.81 కోట్ల మంది మహిళలు వినియోగించుకోగా, వారికి రూ.185.60 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో గృహజ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం రూ.107.77 కోట్ల సబ్సిడీ అందించినట్లు మంత్రి జూపల్లి వివరించారు. 1,27,056 మంది వినియోగదారులకు 4.13 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించినట్లు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 50,314 మందికి శస్త్రచికిత్సల ద్వారా ప్రయోజనం పొందారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటి వరకు 10,232 ఇళ్లకు రూ.511.60 కోట్ల అంచనాతో మంజూరు చేయగా, 9,208 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గానికి మరో 1,500 ఇళ్లు..
రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 1,500 ఇళ్లతో పాటు 500 ఇళ్లకు పైకప్పు మార్పునకు నిధులు మంజూరు చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. 94,176 మందికి ప్రతి నెల రూ.23 కోట్ల పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 2,12,153 మంది రైతులకు రూ.818.22 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అలాగే, 76,385 మంది రైతులకు రూ.597.05 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా 41,647 రేషన్ కార్డులు జారీ చేసినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. రైతుబీమా పథకం కింద మరణించిన 1,855 మంది రైతుల నామినీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.92.75 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. బ్యాంకు లింకేజీ కింద 10,868 మహిళా సంఘాలకు రూ.177 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. బాలానగర్ మండలం పెద్దయిపల్లి, సీసీకుంట మండలం దమగ్నపూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి కూడా ఈ పాఠశాల మంజూరైందన్నారు.
76 పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు..
అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద 642 పాఠశాలల్లో పనులు ప్రారంభించామని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. 76 పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు ప్రారంభించినట్లు తెలిపారు. బాలానగర్ మండలం పెద్దయిపల్లిలో నవోదయ విద్యాలయం మంజూరైందని, ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో భాగంగా ట్రిపుల్ ఐటీ మంజూరైనట్లు తెలిపారు.
భూ భారతి చట్టాన్ని అమలు చేస్తూ ఇప్పటి వరకు 6,545 అర్జీలు, సాదాబైనామా దరఖాస్తుల్లో 3,840 దరఖాస్తులను పరిష్కరించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కోయిల్‌సాగర్, మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం11,150 ఎకరాల భూ సేకరణ పూర్తయిందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 7,969 మంది లబ్ధిదారులకు రూ.80.67 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. రూ.30 కోట్లతో రంగారెడ్డిగూడ–రాజాపూర్, రూ.20 కోట్లతో నవాబ్‌పేట–తిరుమలాపూర్ రహదారిని రెండు వరుసల రహదారులుగా అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తు చేశారు. రూ.110 కోట్లతో కురుమూర్తి స్వామి దేవాలయం, చిన్నచింతకుంట వద్ద ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
వన సంరక్షణ, పర్యాటక అభివృద్ధి..
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 37.99 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పిల్లలమర్రి ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందన్నారు. కోయిల్‌సాగర్ అభివృద్ధికి రూ.9.5 కోట్లు, పిల్లలమర్రి పర్యాటక కేంద్రం అభివృద్ధికి రూ.2.5 కోట్లతో వివిధ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రామకొండ, కోయిలకొండ ప్రాంతాలను కూడా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాలలో మినీ స్టేడియం, భూత్పూర్ మండలం పోతులమడుగు, సీసీకుంట, జడ్చర్ల మినీ స్టేడియం, వాలీబాల్ అకాడమీ తదితర పనులు పూర్తయినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి రూ.10.70 కోట్లు, నాలుగు ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు రూ.కోటి మంజూరైనట్లు మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

