మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం: బాకరాజు శ్రీనివాస రావు

కలం, వనపర్తి: కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు డబ్బు, సమయాన్ని వృథా చేసుకోకుండా మధ్యవర్తిత్వ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌, ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి బాకరాజు శ్రీనివాస రావు (Bakaraju Srinivasa Rao) సూచించారు. అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిర్వహించనున్న మధ్యవర్తిత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం కోర్టు హాలులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తినప్పుడు.. మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు.

మధ్యవర్తులకు శిక్షణ..

అలా వనపర్తి జిల్లాలో 15 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు అందుబాటులో ఉన్నారని జడ్జి బాకరాజు శ్రీనివాసరావు తెలిపారు. వైవాహిక, కుటుంబ, ఆస్తి, భూ, డబ్బు, వినియోగదారుల తదితర వివాదాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి మధ్యవర్తిని కోరవచ్చన్నారు. ఇరుపక్షాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మధ్యవర్తి కృషి చేస్తారని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే కోర్టుల చుట్టూ తిరగడం, సమయం, న్యాయపరమైన ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. నామమాత్రపు రుసుముతో సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. రాజీ కుదిరిన సందర్భాల్లో కోర్టు ఫీజు వాపసు పొందే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు.

గోప్యతకు ప్రాధాన్యం..

రాజీకి అవకాశం ఉందని న్యాయమూర్తికి అనిపించినప్పుడు కేసును మధ్యవర్తిత్వానికి పంపవచ్చని జడ్జి బాకరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఇరుపక్షాలు కోరుకున్నా విజ్ఞాపన పత్రం ద్వారా మధ్యవర్తిత్వానికి పంపాలని అభ్యర్థించవచ్చన్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో కక్షిదారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా, అనధికారికంగా, గోప్యంగా వెల్లడించవచ్చని వివరించారు. రాజీ కుదరకపోయినా మధ్యవర్తిత్వంలో వెల్లడించిన విషయాలను తదుపరి విచారణలో ఒక పక్షానికి వ్యతిరేకంగా ఉపయోగించలేరని స్పష్టం చేశారు.

మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాల మధ్య శత్రుత్వం తగ్గడంతోపాటు వ్యక్తిగత, వ్యాపార సంబంధాలను కొనసాగించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫాస్ట్‌ ట్రాక్‌, పోక్సో కోర్టుల న్యాయమూర్తి కోట్ల లావణ్య బాల్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.కళార్చన, అడిషనల్‌ సివిల్‌ జడ్జి కె.కవిత, బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కిరణ్‌, కార్యదర్శి వెంకటరమణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప కాసరగడ్డ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>