కలం, నల్లగొండ: సముద్రాలు దాటినా.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా తెలుగు వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోరని లూటన్‌లో(Luton) జరుగుతున్న వినాయక చవితి వేడుకలు మరోసారి చాటిచెప్పాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ కౌంటీలో, లండన్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక పట్టణం లూటన్‌లో వినాయక చవితి వేడుకలు (Ganesh Chaturthi Celebrations) ఘనంగా నిర్వహిస్తున్నారు. ‘లూటన్ తెలుగు అసోసియేషన్’ (ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు స్థానిక తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి. లూటన్‌లో సుమారు 1,500 తెలుగు కుటుంబాలు నివసిస్తుండగా.. యూకేలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో వేడుకలకు తరలివచ్చారు. నిర్వాహకుల అంచనా ప్రకారం ఇప్పటివరకు 3,000కుపైగా తెలుగు కుటుంబాలు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేశారు.
2022లో పడిన పునాది..
విదేశాల్లోని తెలుగు వారిని ఒకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో కొందరు యువకులు 2022 వినాయక చవితికి ముందు ‘లూటన్ తెలుగు అసోసియేషన్’ను ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్లపాటు ఉత్సవాలను నిర్వహించలేకపోయినా.. 2025 నుంచి వేడుకలను తిరిగి పునరుద్ధరించారు. ఈ ఏడాది ఉత్సవాలకు విశేష స్పందన లభించింది. వేడుకలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా రేవన్పల్లికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆనేగు జైపాల్ రెడ్డిని నిర్వాహకులు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.
ఏకతా వేదికగా వినాయక చవితి
లూటన్‌లోని వినాయక చవితి వేడుకలు కేవలం పూజలకే పరిమితం కాకుండా.. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారు ఒకరినొకరు కలుసుకునేందుకు, స్వగ్రామాల జ్ఞాపకాలను పంచుకునేందుకు వేదికగా మారాయని నల్లగొండకు చెందిన లూటన్ నివాసి ఎస్. సంపత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ తెలుగు వారిని ఐక్యంగా ఉంచేలా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎల్‌టీఏ నిర్వాహకులు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల నిర్వహణలో ఎల్‌టీఏ కోర్ టీమ్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సాయి గోపి కొసూరి, వినీత్ రెడ్డి కుసుకుంట్ల, నిషాంత్ రెడ్డి పల్లె, సంపత్ రెడ్డి సింగపురం, మహేష్ గౌడ్ పాలకుర్తి, వేణుసాయి శ్రీపతి, నరేంద్ర కుమార్ పెద్ది, జనకిరామ్ రెడ్డి బాచు, గెల్లి సాయి కుమార్, అనిల్ కుమార్ కారంశెట్టి, సరిత్ వెన్ను తదితరులు కీలక పాత్ర పోషించారు.

