కలం, ఖమ్మం బ్యూరో: నేర చరిత్రను పక్కనపెట్టి ప్రశాంతంగా జీవించకపోతే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు డీఎస్పీ (Yellandu DSP) వెంకన్నబాబు రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం ఇల్లందు పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆయన ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందన్నారు. ఎవరైనా బెదిరింపులు, దాడులు లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా నేర మార్గాన్ని వీడి కుటుంబ సభ్యులతో కలిసి బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో సీఐలు సురేష్, సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతి, ఉమా, సారంగపాణిలతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

