కలం, నల్లగొండ: సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు నల్లగొండ (Nalgonda) డీఎస్పీ శివరాం రెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై, అవినీతి అక్రమాలపై నిఖార్సయిన నిజాలు రాస్తున్న క్షేత్రస్థాయి జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారానికి తెగబడుతున్నారన్నారు. అసలైన పాత్రికేయులను ‘నకిలీ జర్నలిస్టులు’గా చిత్రీకరిస్తూ వారి విశ్వసనీయతను, మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ఎండగడుతూ వార్తా కథనాలు రాస్తుండటంతో, తట్టుకోలేని కొందరు వ్యక్తులు వ్యక్తిత్వ హననానికి (క్యారెక్టర్ అస్సాసినేషన్) పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘జనం సాక్షి’ దినపత్రిక నల్లగొండ బ్యూరో ప్రతినిధి ఓడపల్లి మధుపై కూడా కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలను వార్తలతో ఎదుర్కోవాలే తప్పా.. ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని డీఎస్పీ శివరాం రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ, జర్నలిస్టుల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఐడీలను గుర్తించి వారిపై సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గుండగొని జయశంకర్, గాదె రమేష్, మల్లికార్జున్ యాదవ్, యాదగిరి, సలీం, అల్లి మల్లికార్జున్, దండంపల్లి రవి, వెంకట మధు, కుషల్, శంకర్, హరి, సుధాకర్, ఎండి కలీమ్ ఖాన్, నవీన్, సైదులు, శివ, సూర్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

