కలం, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి (Tadipatri)లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతున్న పోటాపోటీ నిరసనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నేడు నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఆధ్వర్యంలో టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి నాయకత్వంలో ఆయన వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ రెండు కార్యక్రమాలతో తాడిపత్రి అట్టుడికిపోయింది. దీంతో కేతిరెడ్డి పెద్దా రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీసులను డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఆయన మంచం వేసుకొని పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్ ముందే స్నానం చేసి హంగామా చేశారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛగా పర్యటించవచ్చని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే దీనిపై జేసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెద్దారెడ్డి నియోజకవర్గంలో తీవ్ర దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఆయపై కేసులు నమోదు చేయాలని తను అనుచరులతో ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా వెంటనే పోలీసులు పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ హైడ్రామా నడుమ పోలీసులు మరోసారి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు.

