కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తెలంగాణలో తమ పార్టీ యాక్టీవ్‌గా ఉంటుందని, ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో పరిపాలనతో బిజీగా ఉన్న పవన్ ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ అవడానికి గల కారణాలు ఏమిటన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ మాత్రం తెలంగాణతో తన బంధం ఎప్పటి నుంచో ఉందని, తనను తెలంగాణ నుంచి ఎవరూ వేరు చేయలేరని చెప్పుకొచ్చారు.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన పవన్‌ను జర్నలిస్ట్ ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ఏపీలో నారా లోకేశ్‌తో ఇబ్బందుల వల్లే తెలంగాణలో పార్టీ విస్తరణకు నిర్ణయించుకున్నారా? అని సదరు జర్నలిస్ట్ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. దీనికి పవన్ సమాధానమిస్తూ తాను తెలంగాణలో ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. తనకు లోకేశ్‌తో ఎలాంటి ఇబ్బందులు లేవని, అలాంటి ఆలోచనలు కూడా ఎప్పుడూ రాలేదని చెప్పారు. 2009 నుంచే తనకు తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు వచ్చాయని పవన్ చెప్పారు. తాను జాతీయత అనే భావంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
పవన్ కల్యాణ్ అసలు ఎప్పుడు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం అందరికీ మిస్టరీగా మారిందని జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు. ఓసారి కర్ణాటకలో, ఓసారి తమిళనాడులో, మరోసారి తెలంగాణలో, ఆంధ్రాలో ఇలా అంతటా పర్యటిస్తుంటారని ప్రశ్నించారు. దీనికి పవన్ సమాధానమిస్తూ తనకు అంతటా అభిమానులున్నారని, ప్రజలు తనను నాయకుడిగా కోరుకుంటున్నారని, పవన్ తమ సమస్యలపై మాట్లాడాలని ఆశిస్తున్నారని చెప్పారు. తనకు స్థానిక భాషలు కూడా రావడం ఇందుకు ప్లస్ అయ్యిందన్నారు. దీనిపై జర్నలిస్ట్ స్పందిస్తూ పక్క రాష్ట్రాల సీఎంలు పవన్ ఎప్పుడు తమ రాష్ట్రానికి వస్తాడో అని భయపడుతున్నారని ఫన్నీగా కామెంట్ చేశారు. దీనికి పవన్ కూడా నవ్వులు చిందించారు.

