కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఇతర అధికారులతో కలిసి నియోజకవర్గ అభివృద్ధి పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
నిధులు మంజూరు చేస్తాం..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, టెండర్లు నిలిచిపోయిన పనులకు అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లుల వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. ప్రజాదర్బార్‌లో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో పూర్తిగా ల్యాండ్ రీ-సర్వే ప్రక్రియకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

