ఐకేపీ కేంద్రాల జాడ లేదు.. రైతులకు కునుకు లేదు!

కలం, జగిత్యాల: వరి పంట చేతికొచ్చినా అమ్ముకునేందుకు జగిత్యాల (Jagtial) జిల్లాలోని మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలో ఇప్పటికే 70 శాతానికి పైగా వరి కోతలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించినా ఆచరణలో జాప్యం చేస్తున్నది.

దీంతో రైతులు ధాన్యాన్ని పొలాల వద్ద, రోడ్ల పక్కన ఆరబోసుకుని రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కేంద్రాల ఏర్పాటుపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులు, దళారులను అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు, కూలీల ఖర్చులు, ఎరువులు, పురుగుమందులు, సాగునీటి ఖర్చులు పెరిగినందున తక్కువ ధరకు ధాన్యం అమ్మడం భారంగా ఉందని రైతులు వాపోతున్నారు.

వాతావరణ మార్పులు కారణంగా..

మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు రైతులను ఆందోళకు గురిచేస్తున్నాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు ఎక్కడ తడిసిపోతుందోనని పట్టాలు కప్పుతూ మళ్లీ ఆరబెడుతుండగా రైతులు కంటిమీద కునుకు ఉండడం లేదు. దీంతో వచ్చిన ధరకు ధాన్యాన్ని అమ్ముకుని నష్టాన్ని భరించాల్సి వస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు. తక్కువ ధరకు తీసుకునే వ్యాపారులపై నిఘా పెట్టి, ప్రతి గింజకూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>