భిక్షాటన చేస్తున్న చిన్నారులను సీఐ భరోసా

​కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల తహసీల్‌ చౌరస్తాలో భిక్షాటన చేస్తున్న ఇద్దరు చిన్నారులను చూసిన పట్టణ సీఐ కరుణాకర్‌ (Jagtial CI Karunakar) చలించిపోయారు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో రోడ్డుపై ఎండలో నిలబడి ఆకలి కోసం చేయి చాస్తున్న చిన్నారులను భరోసా కల్పించారు. వయసులో వారి చేతుల్లో అందమైన రంగుల పుస్తకాలు ఉండాలి. రోజంతా బడిలో ఆటపాటలతో, అక్షరాల సవ్వడితో వారి బాల్యం వికసించాలి. కానీ, పేదరికం, కుటుంబ పరిస్థితులు ఆ పిందెలను రాలిపోయేలా చేశాయి. నాలుగైదేళ్ల చిన్నారి చేతులకు చదువుల పుస్తకాలకు బదులు భిక్షాపాత్రలు చిక్కాయి. మండుటెండలో, రోడ్డు పక్కన నిలబడి ఆకలి కేకలతో చేయి చాస్తున్న ఆ ఇద్దరు చిన్నారుల దృశ్యం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది.

కానీ, నిత్యం శాంతిభద్రతల నిర్వహణలో బిజీగా ఉండే ఓ పోలీస్ అధికారి హృదయాన్ని మాత్రం అది తీవ్రంగా కదిలించింది. ​విధుల్లో భాగంగా జగిత్యాల తహసీల్‌ చౌరస్తా మీదుగా వెళ్తున్న పట్టణ సీఐ కరుణాకర్‌ (Jagtial CI) కంట ఈ దృశ్యం పడింది. వాహనంలోంచి చూసి వెళ్ళిపోకుండా వెంటనే తన బండిని పక్కకు ఆపారు. ఖాకీ డ్రెస్ చూసి పిల్లలు ఎక్కడ భయపడతారో అని ఎంతో ఆప్యాయంగా వారి వద్దకు వెళ్లారు. చిన్నారులను దగ్గరకు తీసుకుని వారి తల్లిదండ్రులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.

​”చదువుకుంటారా నాన్నా.. మిమ్మల్ని నేను చదివిస్తా!”

కన్నుల్లో నీళ్లు తిరుగుతున్నా సరే ఆ చిన్నారుల ముఖాల్లోకి చూస్తూ సీఐ కరుణాకర్ ఇచ్చిన ఆ ఒక్క భరోసా వారి జీవితాలనే మార్చేసింది. “చదువుకుంటారా.. మిమ్మల్ని నేను చదివిస్తా” అని ప్రేమగా అడిగేసరికి, ఆ చిన్నారుల కళ్లలో అప్పటివరకు ఉన్న నిరాశ పోయి వికసించిన చిరునవ్వు కనిపించింది. ఆయన మాటలపై నమ్మకంతో “మీ వెంట వస్తాం సార్” అని ఆ పిల్లలు చెప్పడం అక్కడ ఉన్నవారిని భావోద్వేగానికి గురిచేసింది. ​వెంటనే ఆ చిన్నారులను సురక్షితంగా ఆటోలో ఎక్కించి, జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. ఆ పిల్లలకు తగిన ఆశ్రయం, రక్షణతో పాటు విద్య నందేలా తదుపరి చర్యలు చేపట్టారు.

​అభినందనల వెల్లువ

కేవలం రోడ్డుపై భిక్షాటన చేయకుండా పిల్లలను పంపించేయడం కాకుండా, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్షరాల వైపు నడిపించిన సీఐ కరుణాకర్ స్పందనపై స్థానికులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక చిన్నారి చేతిలోని భిక్షాపాత్రను తీసేసి, పుస్తకాన్ని పెట్టాలన్న ఆయన ఆలోచన సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఖాకీ చొక్కా వెనుక ఉన్న ఈ కరుణామయ హృదయానికి అందరూ సలామ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>