కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) చాంబర్ ఆఫ్ కామర్స్ (వర్తక సంఘం) ఎన్నికల ప్రక్రియ బుధవారం ఏకగ్రీవంగా పూర్తయ్యింది. రెండోసారి కమటాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈనెల 15న వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం బుధవారంనామినేషన్ల స్క్రూటిని చేపట్టగా, ప్రకటించిన 5 పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అధ్యక్షులుగా కమటాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది శ్రీనివాస్, కోశాధికారిగా కప్పల శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా ఎలిమిల్ల చంద్రకాంత్, సహాయ కార్యదర్శి గా సామ సునీల్ కుమార్ లు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వీరిని ఎన్నికల కన్వీనర్ పల్లెల రాజయ్య, ఎన్నికల అధికారి పబ్బ శ్రీనివాస్, ఉప ఎన్నికల అధికారులు శ్రీనివాసమూర్తి, పాత సుధాకర్ తదితరులు అభినందించి సన్మానించారు. ఏకగ్రీవ ఎన్నిక (Chamber of Commerce) జగిత్యాల పట్టణంలోని ఇతర సంఘాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ఇది సభ్యుల ఐకమత్యానికి, సంఘ బలోపేతానికి నిదర్శనమని నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. అనుబంధ సంఘాల ఆలోచనల మేరకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి, త్వరలో నూతన కార్యవర్గ పరిచయ వేదికను నిర్వహిస్తామని వారు తెలిపారు.

