కలం, సూర్యాపేట: షాబాద్ సైకో ఘటనకు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు అస్సలు తేడా లేదని బీఆర్ఎస్ (BRS) మాజీమంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ తెలంగాణకు గొప్ప అవకాశం సృష్టించారని కొనియాడారు. బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతా అని సీఎం అనడం ఆయన రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కేసీఆర్ రక్తం చెమటగా మారడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని.. రేవంత్ రెడ్డికి రక్తం కావాలంటే కేటీఆర్‌తో సహా తాము అందరం సిద్ధంగా ఉన్నామని అన్నారు.
తెలంగాణ ద్రోహుల చేతిలో ఆయుధంగా రేవంత్..
ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహుల చేతిలో ఆయుధంగా పనిచేశారని జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. తెలంగాణవాదులుగా వాస్తవాలు మాట్లాడుతున్న రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెడతామని సీఎం బెదిరిస్తున్నారని, గతంలో ఇలా జైల్లో పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారని హెచ్చరించారు. సీఎంను ‘చీడపురుగు’ అన్నందుకు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, మరి బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ఎలాంటి కేసులు పెట్టాలో ఆలోచించాలని డిమాండ్ చేశారు.
50 శాతం నేరాలు పెరిగాయి..
రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో రాష్ట్రంలో నేరాలు 50 శాతం పెరిగాయని, దీనిపై డీజీపీ ఏం రివ్యూ చేస్తున్నారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే బెల్ట్ ట్రీట్ మెంట్ ఇస్తారా? అని ఆయన నిలదీశారు. మేడిగడ్డపై సీఎం మూర్ఖత్వపు ప్రచారం చేస్తున్నారని, భద్రాచలం కొట్టుకుపోతుందంటూ అజ్ఞానంగా సీఎం, మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. గోదావరికి 290 టీఎంసీల వరద వచ్చినా భద్రాచలానికి ఏమీ కాలేదని అన్నారు. సీఎం పదవి పిచ్చిలో పడి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జ్ఞాపకశక్తి తగ్గినట్టుందని ఎద్దేవా చేశారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తనతో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
అలాంటి వాళ్లు దేశద్రోహులు..
విద్యుత్ బిల్లుల సాకుతో రైతులకు నీళ్లు ఇవ్వొద్దని మాట్లాడేవాళ్లు దేశద్రోహులని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్ నినో వల్ల తాగునీళ్లకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ కాదు, ‘హైబ్రిడ్ కాంగ్రెస్’ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ ఒక్కటేనని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వానికి అసెంబ్లీ పెట్టే దమ్ము ఉందా? ఒక్కసారి కేసీఆర్ (KCR) అసెంబ్లీకి వస్తే వీళ్లు లాగులు తడుపుకుంటారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
Read Also: కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి: కొండా సురేఖ
Follow Us On: X(Twitter)

