కలం, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) శుభారంభాన్ని కొనసాగించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జైమ్ ఫరియాను ఓడించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు.తొలి సెట్లో అల్కరాజ్ 4-6తో వెనుకబడ్డాడు. అయితే ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా 6-0, 6-3, 6-2 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం అల్కరాజ్ మాట్లాడాడు.
మొదటి సెట్ తనకి ఒక సర్దుబాటులా అనిపించిందని చెప్పాడు. త్వరితగతిన పాయింట్లు సాధించాలనే తొందరపాటులో తప్పు చేశానని అంగీకరించాడు. ఆ తర్వాత సుదీర్ఘ ర్యాలీలు ఆడాలని గ్రహించినట్లు తెలిపాడు.రెండో సెట్ నుంచి వ్యూహం మార్చానని వివరించాడు. తన జట్టు సూచనతో క్రాస్-కోర్ట్ షాట్లు ఎక్కువగా ఆడినట్లు చెప్పాడు. ప్రత్యర్థి చేసిన కొన్ని పొరపాట్లు తనకు అనుకూలించాయని పేర్కొన్నాడు. ఆపై మ్యాచ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నానని తెలిపాడు.
ఆర్థర్ ఆషే స్టేడియంలో ఆడటం తనకెంతో ఇష్టమని అల్కరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. న్యూయార్క్ ప్రేక్షకుల ఉత్సాహం తనకు మరింత శక్తినిస్తుందని చెప్పాడు. తదుపరి రౌండ్లోనూ వారిని అలరిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.రెండుసార్లు యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అయిన అల్కరాజ్, 2022లో మొదటి గ్రాండ్‌స్లామ్ గెలిచాడు. మళ్లీ 2025లో ఈ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఈ ఏడాది మొదట్లో 22 ఏళ్ల వయసులోనే క్యారీయర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
యూఎస్ ఓపెన్‌లో ఇది అతనికి 26వ విజయం.తదుపరి రౌండ్లో చైనా ఆటగాడు వూ యిబింగ్‌తో అల్కరాజ్ తలపడనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ డక్‌వర్త్‌ను ఓడించి యిబింగ్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. గతంలో వీరిద్దరూ 2024 షాంఘై టోర్నీలో ఒకసారి తలపడగా, అందులో అల్కరాజ్ విజయం సాధించాడు.

