కలం, వెబ్ డెస్క్: చెన్నైను హోం గ్రౌండ్లో ఎస్ఆర్‌హెచ్ చిత్తకొట్టింది. చెన్నై ఇచ్చిన 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికే ఛేజ్ చేసేసింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) క్లాసికన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అతడికి హెన్రిచ్ క్లాసెన్ కూడా అంతే మద్దతు ఇచ్చాడు. వీరిద్దరూ ఊపిన ఊపుకు ఆరెంజ్ ఆర్మీ విజయం ఖరారయింది. ఆఖరి వరకు పోరాడిన ఇషాన్ కిషన్ ఆఖర్లో క్యాచ్ అవుటయ్యాడు. కానీ అప్పటికే మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ సొంతమైపోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును హైదరాబాద్ బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. ఓపెనర్ సంజూ శాంసన్ 13 బంతుల్లో 27 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించినా పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో ఎక్కువ సమయం గడిపినా కేవలం 15 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. మిడిలార్డర్‌లో కార్తీక్ శర్మ 32 రన్స్ చేయగా, ఐదో స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో శివమ్ దూబే 26 పరుగులు చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు, ఇషాన్ మలింగ, ప్రాఫుల్ హింజే చెరో వికెట్ సాధించారు.
అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 6 పరుగులు చేసి ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో ఆయనకే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ 21 బంతుల్లో 26 పరుగులు చేసి అకీల్ హొసేన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ జంట చెన్నై బౌలర్లపై విరుచుకుపడింది. ఇషాన్ కిషన్ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో మెరిసి కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పేశాడు. ఆయనకు అద్భుతమైన మద్దతు ఇచ్చిన క్లాసెన్ 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు బాది నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 11 రన్స్ చేసి అవుటైనప్పటికీ, ఆఖర్లో సలీల్ అరోరా 10 పరుగులు, రవిచంద్రన్ స్మరన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 2 వికెట్లు తీసుకోగా, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, అకీల్ హొసేన్ తలో వికెట్ పడగొట్టారు.

