కలం, వెబ్ డెస్క్: భారత్, ఆఫ్ఘనిస్తాన్ వన్డే సమరానికి కౌంట్‌డౌన్ షురూ అయింది! శనివారం ధర్మశాల వేదికగా జరగబోయే తొలి వన్డే మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఇరు జట్లు ఈ వన్డే పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ హైవోల్టేజ్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఒక సంచలన ప్రకటన చేశారు. రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ విజయం సాధించాలంటే సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన ఆయన, సౌతాఫ్రికా పిచ్‌లపై వీరిద్దరి అనుభవం లేకపోతే టీమిండియాకు గెలుపు కష్టమేనని తేల్చి చెప్పారు.
సౌతాఫ్రికాలో బౌలర్లకు దొరికే అదనపు బౌన్స్‌ను ఎదుర్కోవడంలో రోహిత్ శర్మ దిట్ట అని పఠాన్ కొనియాడారు. షార్ట్ పిచ్ బంతులను శిక్షించగల అద్భుతమైన టైమింగ్ రోహిత్ సొంతమన్నారు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రికార్డులే మాట్లాడతాయని, కష్ట సమయాల్లో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే మొనగాడు కోహ్లీనే అని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రపంచంలోనే విరాట్ అత్యుత్తమ ఛేజర్ అని గుర్తు చేశారు.
మరోవైపు వికెట్ కీపింగ్ రేసులో కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ అని పఠాన్ మద్దతుగా నిలిచారు. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ ఎంతో నిలకడగా ఆడుతున్నాడని చెప్పారు. అలాగే టాప్ ఆర్డర్‌లో ఆడగల ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ కీపర్‌గా ఎంపిక చేయడం స్మార్ట్ మూవ్ అని అభినందించారు. ఇక మిడిల్ ఆర్డర్ రేసులో సంజూ శాంసన్ కూడా బలంగా ఉన్నాడని, క్రీజులో అతని పరిణతి, ప్రెజర్ హ్యాండ్లింగ్ చూశాక ఐదో స్థానంలో అతనికి ఛాన్స్ ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు.

