కలం, వెబ్ డెస్క్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ (Khamenei) అంత్యక్రియల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. జులై 9న ఖనన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. సుప్రీం లీడర్ మరణించిన రెండు రోజుల తరువాత ఆ విషయాన్ని టెహ్రాన్ అధికారికంగా తెలిపింది. అయితే అంత్యక్రియలపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఆయన్ను రహస్యంగా ఖననం చేశారా.. శవపేటికలోనే భద్రపరిచారా.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా అధికారికంగా వివరాలు ప్రకటించింది.
జులై 4 నుంచి ప్రారంభం..
సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు 5 రోజుల పాటు జరగనున్నాయి. జులై 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భౌతికకాయాన్ని టెహ్రాన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 7వ తేదీన పవిత్ర నగరం ‘కోమ్’లో మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 9న ఖమేనీ స్వస్థలమైన మష్హద్‌లోని ‘ఇమామ్ రెజా ష్రైన్’ వద్ద అంతిమ ఖననం చేయడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఆయన మరణానంతరం కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ పాలకుడిగా పగ్గాలు చేపట్టాడు. అమెరికా దాడిలో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినా.. ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ఖమేనీ అంత్యక్రియల సమయంలోనైనా బయటకు వస్తారా.. లేదా.. అనే చర్చ జరుగుతోంది.

