కలం, ఆదిలాబాద్ : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Bima) పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. పథకం అమలుపై ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. మండల స్థాయి అధికారులు, వార్డు అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక కార్యాచరణ విధానంపై (ఎస్ఓపీ) శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. నమోదు ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎంపీడీవోలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక లాగిన్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి నమోదు శిబిరంలో ఇంటర్నెట్ కనెక్షన్, ప్రింటర్, స్కానర్ వంటి సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేశామని, అన్ని గ్రామాల్లో శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముందుగా నింపిన దరఖాస్తు ఫారాలను కూడా శిబిరాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతి అర్హ కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీఓ మంద మకరంద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

