ప్రగతిపథంలో భద్రాద్రి.. ఎయిర్‌పోర్ట్ టచ్‌.. జపాన్ అప్రోచ్‌!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ పారిశ్రామిక ముఖచిత్రంలో ‘సింగరేణి బొగ్గు గనులు’ అనగానే గుర్తుకొచ్చే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, ఇప్పుడు తన పాత ముద్రను చెరిపేసుకుని సరికొత్త ప్రగతి శకంలోకి అడుగుపెడుతోంది. ఒకవైపు గగనతలాన్ని తాకే విమానాశ్రయ కల సాకారమవుతుండగా, మరోవైపు అంతర్జాతీయ స్థాయి పరిపాలనా నమూనాలను అందిపుచ్చుకుంటూ జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుండటంతో, ‘ఎయిర్‌పోర్ట్ టచ్.. జపాన్ అప్రోచ్’ అనే రెండు బలమైన అంశాలు కేంద్రంగా భద్రాద్రి జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి.

​ఈ పరివర్తనలో అత్యంత కీలకమైనది రవాణా రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు. ఇన్నాళ్లూ కేవలం నల్లబంగారం వెలికితీతకు మాత్రమే పరిమితమైన ఈ నేలపై, ఇకపై విమానాల రయ్ రయ్ మోత మోగనుంది. ఆరు ప్రాంతాల్లో విస్తృత అధ్యయనం చేసిన అనంతరం, సుజాతనగర్ మండల పరిధిలో 667 ఎకరాల స్థలంలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించడం జిల్లా చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం.

ఒక దశలో అసాధ్యమనుకున్న ఈ ప్రాజెక్టు కోసం స్థానిక ఎమ్మెల్యే కూనంనేని, జిల్లా మంత్రులు ఢిల్లీ స్థాయి వరకు చేసిన నిరంతర కృషి ఎట్టకేలకు ఫలించింది. ప్రధాన రహదారికి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు 5.7 కిలోమీటర్లు, పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి కేవలం 35.4 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయం రానుండటం ఆధ్యాత్మిక పర్యాటకానికి, పారిశ్రామిక పెట్టుబడులకు, స్థానిక యువత ఉపాధికి పెద్ద వరంగా మారనుంది.

​వాయు మార్గంతో పాటు పట్టణ రోడ్డు, రైలు రవాణా వ్యవస్థల్లోనూ దశాబ్దాల అడ్డంకులు తొలగిపోయాయి. కొత్తగూడెం ప్రజలను గత 15 ఏళ్లుగా నిత్యం ట్రాఫిక్ నరకంలోకి నెడుతున్న హేమచంద్రాపురం రోడ్డు విస్తరణ సమస్యకు ఎట్టకేలకు చరమగీతం పాడారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ప్రత్యేక చొరవ, ఎమ్మెల్యే కూనంనేని సమన్వయ సహకారానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ల సానుకూల నిర్ణయాలతో భూముల మార్పిడి ప్రక్రియ కొలిక్కి వచ్చింది.

ఇందులో భాగంగా కొత్తగూడెంలో 5,500 చదరపు గజాల రైల్వే భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించగా, ఖమ్మంలో 4,500 చదరపు గజాల ప్రభుత్వ భూమిని రైల్వే శాఖకు కేటాయించారు. కేవలం ఈ ఒక్క రహదారే కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు సూర్య ప్యాలెస్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు, గణేష్ టెంపుల్ నుంచి ప్రగతి వన్ నగర్ వరకు ఐదు ప్రధాన రహదారుల విస్తరణతో పట్టణం సుందరంగా మారుతోంది. దీనికితోడు ‘భద్రాచలం రోడ్’ రైల్వే స్టేషన్ పేరును ‘కొత్తగూడెం’గా మార్చే ప్రక్రియ కూడా తుది దశకు చేరుకోవడం జిల్లా కేంద్రానికి ఒక స్పష్టమైన గుర్తింపును, పట్టణవాసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

​మౌలిక సదుపాయాల కల్పన ఒక ఎత్తయితే, పరిపాలనలో ఆధునికతను జోడించి సామాన్యుడి జీవన ప్రమాణాలను పెంచేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్ ‘జపాన్ అప్రోచ్’ను జిల్లాకు పరిచయం చేస్తున్నారు. నీతి ఆయోగ్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్’ కార్యక్రమంలో భాగంగా ఆయన నవంబర్ 15 నుంచి 21 వరకు జపాన్‌లో అధ్యయన పర్యటన చేస్తున్నారు. విద్య, వైద్యం, పోషకాహారం, తాగునీరు, పారిశుధ్యం వంటి కీలక రంగాల్లో వెనుకబడిన ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు జపాన్ అనుసరిస్తున్న విధానాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

ముఖ్యంగా, పరిమిత వనరులతో అధిక దిగుబడులు సాధించడంలో ప్రపంచానికే ఆదర్శమైన జపాన్ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన కలెక్టర్, అక్కడి యాంత్రీకరణ, సాంకేతిక సాగు పద్ధతులను అధ్యయనం చేశారు. జపాన్ వ్యవసాయ విధానాలను భద్రాద్రి జిల్లా వాతావరణం, నేల స్వభావం, స్థానిక పంటలకు అనుగుణంగా అన్వయించడం ద్వారా రైతుల శ్రమ, సమయం ఆదా కావడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

​అభివృద్ధి పనులతో పాటు సామాన్యుడికి న్యాయ సేవలను మరింత చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రగతి ప్రస్థానానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇంతకాలం ఖమ్మం కోర్టులో పెండింగ్‌లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ కేసులను కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనివల్ల విచారణ నిమిత్తం కక్షిదారులు ఖమ్మం వెళ్లే వ్యయప్రయాసలు, సమయం ఆదా కావడంతో పాటు స్థానికంగానే సత్వర న్యాయం పొందే వెసులుబాటు కలిగింది.

​మొత్తంగా చూస్తే, రాజకీయ నాయకత్వ సమన్వయం, అధికార యంత్రాంగం దూరదృష్టి కలగలిసిన వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరికొత్త అభివృద్ధి నమూనాకు వేదికవుతోంది. అనుమతులు, అధ్యయనాల దశను దాటి ఈ ప్రాజెక్టులన్నీ క్షేత్రస్థాయిలో వేగంగా కార్యరూపం దాల్చినప్పుడు, బొగ్గు గనుల నేల తెలంగాణలోనే ఒక ఆదర్శవంతమైన, ఆధునిక జిల్లాగా నిలవడం ఖాయం అనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>