కలం, వనపర్తి: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) అన్నారు. బుధవారం ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, డిజిటల్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గంలో ప్రతినెలా సుమారు రూ.11 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తూ వేలాది పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజాప్రయోజన పథకాలను కొనసాగిస్తూనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా కుటుంబ పెద్ద అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు చెప్పారు. నవంబర్ 19 నుంచి ఈ పథకం ప్రారంభం కానుందని వెల్లడించారు. నియోజకవర్గానికి ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించామని, ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యమన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, చేయూత పింఛన్లు వంటి పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్ రెడ్డి, మార్కెట్ యార్డు అధ్యక్షురాలు నవనీత క్యామ రాజు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, మండల అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, సింగిల్ విండో అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, నాయకులు రవి నాయక్, వెంకట్రావు, మురళీధర్, నవీన్ రెడ్డి, ఆగారం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

