కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పేదల ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు ఆర్థిక ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వ నివాస పథకమైన పీఎం ఆవాస్ యోజన (PMAY)తో అనుసంధానించాలని నిర్ణయించింది.
ఈ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం రెండు విడతల్లో వేగవంతంగా పూర్తి చేయనుంది. మొదటి విడత కింద ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన 1.75 లక్షల ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అధికారులు పీఎం ఆవాస్ యోజన అధికారిక పోర్టల్లో విజయవంతంగా నమోదు చేశారు. ఇక రెండో విడతలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న మరో 25 వేల మంది లబ్ధిదారులను కూడా ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకురానున్నారు.
ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తిగా ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కోటా ప్రకారం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.72,000 నిధులు నేరుగా జమ కానున్నాయి. పీఎం ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 2 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.72 వేల చొప్పున ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది.

