కలం, మెదక్ బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించి, పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) మండిపడ్డారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ప్రభుత్వం అధికారంలో లేదనే కారణంతో రాష్ట్ర అభివృద్ధిని, పెట్టుబడుల రాకను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్షాల వైఖరి వల్ల చివరకు నష్టపోయేది రాష్ట్ర యువతేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు..
పాలసీల కొనసాగింపుతోనే పెట్టుబడిదారులకు నమ్మకం పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత పాలసీలను రద్దు చేస్తున్నారని, కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన మంచి ఇండస్ట్రియల్ పాలసీలను తాము కొనసాగిస్తున్నామని, దీనివల్ల పెట్టుబడిదారులలో ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
తక్కువ ఖర్చుతో గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అత్యంత తక్కువ ఖర్చుతో ‘గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. తద్వారా అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

