బెంబెరలో గంజాయి సాగు గుట్టురట్టు.. 300 మొక్కలు గుర్తింపు

కలం, తానూర్: పత్తి పంట మాటున గంజాయి మొక్కల (Cannabis Plants) సాగు చేస్తున్న అక్రమ దందా పోలీసుల తనిఖీల్లో వెలుగుచూసింది. తానూర్ మండలం బెంబెర గ్రామ పరిధిలోని మూడు వ్యవసాయ పొలాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ తనిఖీల్లో పత్తి పంట మధ్యలో సుమారు 250 నుంచి 300 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు.

ఒక పొలంలో గంజాయి మొక్కలను కోసి విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. అంతేకాకుండా, సంబంధిత వ్యక్తుల ఇంటి వెనుక ఉన్న పొలంలో కోసిన గంజాయిని దాచి ఉంచగా, డాగ్ స్క్వాడ్ శునకాలు వాసన పసిగట్టి నిల్వ ఉంచిన ప్రదేశాన్ని గుర్తించాయి. దీంతో అక్కడ దాచిన గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు, నిల్వకు సంబంధించి ప్రత్యేక బృందాలతో తనిఖీలు కొనసాగుతున్నాయని, మరింత గంజాయి బయటపడే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

వ్యవసాయ శాఖ అధికారుల పరిశీలన అనంతరం స్వాధీనం చేసుకున్న పంట విలువను వెల్లడించనున్నారు. పంచనామా పూర్తిచేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఆర్ఎస్ఐలు రాకేష్, విజయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>