కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఖాళీగా ఉన్న మొత్తం 19 వేల పోలీసు ఉద్యోగాలకు (Police Vacancies) తక్షణమే ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ, రెండున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 19,000 పోలీస్ ఖాళీలు ఉంటే.. కేవలం 5 వేలకే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమేనని మండిపడ్డారు. కుదించిన వయోపరిమితిని వెంటనే రద్దు చేసి, గతంలో ఉన్నట్లు కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలన్నారు. నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని హరీశ్ రావుకు నిరుద్యోగ యువత వినతిపత్రం సమర్పించారు.
కుదించిన ఏజ్ లిమిట్‌ను రద్దు చేయాలి..
కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే, అందులో 2 వేల పోస్టులు హైదరాబాద్ పరిధిలోకే వెళ్లిపోతాయని హరీశ్ రావు అన్నారు. మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో కులానికి ఒక్క పోస్టు కూడా దక్కదని, దీనివల్ల గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఈ రెండున్నర ఏళ్లలో నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన ఏజ్ లిమిట్ ను వెంటనే రద్దు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నట్లుగానే కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలన్నారు.
పాత విధానాన్నే కొనసాగించాలి..
పోలీస్ ఈవెంట్స్‌లో కూడా రేవంత్ సర్కార్ నిబంధనలు కఠినతరం చేయడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఈవెంట్లలో మూడింటికి అర్హత సాధిస్తే సరిపోయేదని.. కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్ పుట్‌లలో దూరం పెంచి మూడింటికి మూడు క్వాలిఫై కావాలని చెప్పడం తీవ్ర అన్యాయమన్నారు. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. తక్షణం అప్లికేషన్ ఫీజు లేకుండా స్వీకరించాలన్నారు.
దిల్‌సుఖ్‌నగర్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం సరైన గ్రౌండ్స్ లేవని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. 19 వేల పోస్టులతోపాటు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సాధించేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

