సైఫాబాద్ పీఎస్ ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లోకి (Saifabad Police Station) 15 మంది వ్యక్తులు చొరబడి తన పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీలు, గుండాల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఈ దాడి కాంగ్రెస్ గుండాల పనా? లేక మఫ్టీలో ఉన్న పోలీసులే ముసుగులు ధరించి కుట్రపూరితంగా దాడి చేయించారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కక్షతో నమోదైన కేసు విచారణ కోసం మహేష్, మహేందర్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఖాకీల సమక్షంలోనే దాడి చేయించారని కేటీఆర్ ఆరోపించారు. ఉదయం విచారణకు రావాలని చెప్పి చీకటి పడే వరకు కాలయాపన చేయడం చూస్తే.. ముందుగానే దాడికి కుట్ర పన్నినట్లు అర్థమవుతోందన్నారు. మహేష్, మహేందర్ రెడ్డిపై తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఘటనకు హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన మహేష్, మహేందర్ రెడ్డికి తక్షణమే రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని వెంటనే భద్రపరచాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని అన్నారు. లేదంటే బీఆర్‌ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>