కలం, వెబ్‌డెస్క్: భారత అథ్లెటిక్స్ రంగానికి సరికొత్త జోష్ ఇచ్చే అప్‌డేట్ వచ్చేసింది. దేశంలో అథ్లెటిక్స్ ప్రతిభను గుర్తించి గౌరవించేందుకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీని కోసం జూన్ 20వ తేదీన ఢిల్లీలో మొట్టమొదటి ‘ఇండియన్ అథ్లెటిక్ అవార్డ్స్’ (Indian Athletic Awards) వేడుకను నిర్వహించనుంది. ప్రపంచ వేదికలపై భారతదేశ కీర్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత, మాజీ అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు, స్పాన్సర్లు, రాష్ట్ర సంఘాలను గౌరవించడానికి ఈ వేడుకను ఒక వేదికగా రూపొందించారు.
ఈ ప్రత్యేక ఈవెంట్‌లో మొత్తం 10 విభాగాలలో అవార్డులను అందజేయనున్నారు. వీటిలో 2025 సంవత్సరానికి గాను బెస్ట్ మేల్ అథ్లెట్, బెస్ట్ ఫిమేల్ అథ్లెట్, బెస్ట్ కోచ్, బెస్ట్ టెక్నికల్ అఫీషియల్ అవార్డులు ఉన్నాయి. వీటితో పాటు మూడు లైఫ్-టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, బెస్ట్ స్టేట్ అసోసియేషన్, బెస్ట్ స్టేట్ సపోర్టింగ్ అథ్లెటిక్స్, అథ్లెటిక్స్‌కు మద్దతు ఇచ్చే సంస్థ, భాగస్వాములకు కూడా అవార్డులు ఇవ్వనున్నారు.
ఈ వేడుక గురించి ఏఎఫ్‌ఐ ప్రెసిడెంట్ బహదూర్ సింగ్ సాగూ (Bahadur Singh Sagoo) మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారత అథ్లెటిక్స్ ఎంతో వృద్ధి చెందిందని చెప్పారు. ఈ అవార్డులు కేవలం పతకాలు గెలిచిన వారికే కాకుండా, వెనుక ఉండి నడిపించే కోచ్‌లు, అధికారులు, సంస్థల కృషికి దక్కే గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ మాజీ, ప్రస్తుత అథ్లెట్లు అందరూ హాజరుకానున్నారు.
దీనిపై ఏఎఫ్‌ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంజు బాబీ జార్జ్ (Anju Bobby George) మాట్లాడుతూ.. ఈ అవార్డుల వేడుక క్రీడాకారుల నిబద్ధతను గౌరవిస్తుందని తెలిపారు. ప్రతీ ఒక్కరి కృషి దేశంలో బలమైన క్రీడా సంస్కృతిని పెంచుతుందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఒలింపిక్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా స్పందిస్తూ, యువ అథ్లెట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఇలాంటి అవార్డులు చాలా అవసరమని చెప్పారు. ఈ గుర్తింపు మొత్తం క్రీడా రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, రాబోయే తరం మరింత మెరుగ్గా రాణించడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన వెల్లడించారు.

