కలం, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లాలో బాలికపై జరిగిన అమానుష ఘటన అత్యంత దారుణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. నేరస్తులు ఎంతటి వారైనా వెంటనే అరెస్ట్ చేసి, కఠిన శిక్ష విధించాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ బాధితురాలికి అండగా ఉంటుందన్నారు.
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను హరీశ్ రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు గోసపడుతున్నాయని.. నిమ్స్ దావఖానలో మందులు కూడా సరఫరా లేని దుస్థితి ఉందన్నారు. వెంటనే బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు రక్షణ కరువైంది: సునీత లక్ష్మారెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగడం అత్యంత బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సభ్య సమాజం అంతా సంఘీభావం తెలుపుతుంటే.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వారు పట్టించుకోవడం లేదన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే, ఒక్కరు కూడా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉండే ఇద్దరు మహిళా మంత్రులు కూడా స్పందించడం లేదన్నారు. బాధిత అమ్మాయికి తీవ్రమైన గాయాలు కాగా, కనీసం సరైన చికిత్స అందించడం లేదని విమర్శించారు. నిందితుడిపై నమోదైన పోక్సో కేసులో నామమాత్రపు సెక్షన్లు నమోదు చేసి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అందరూ ప్రశ్నించే సరికి సెక్షన్లు మార్చారని అన్నారు. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

