కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని నిరసిస్తూ కరీంనగర్‌లో (Karimnagar) శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఛైర్మన్, తెలంగాణ రక్షణ సేన మానకొండూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెన్నమల్ల చైతన్య నిరవధిక దీక్ష ప్రారంభించారు. టీఆర్ఎస్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ దీక్షకు మద్దతు ప్రకటించి మాట్లాడారు. సుమారు 25 లక్షల మంది రాసే నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని పేర్కొన్నారు.
ఎవరిదీ బాధ్యత..
డాక్టర్ కావాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా కష్టపడుతున్న విద్యార్థుల ఆశయాలను వరుస పేపర్ లీకేజీలు దెబ్బతీస్తున్నాయని హరిప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. నష్టపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బలప్రయోగం చేయడం దారుణం..
నీట్ పేపర్ లీకేజీ నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను కొట్టడం, బలప్రయోగం చేయడం దారుణమని హరిప్రసాద్ మండిపడ్డారు. విద్యార్థి లోకం నీట్ పేపర్ లీకేజీ బాధితుల పక్షాన నిలబడుతున్నా.. కేంద్రం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య ప్రవేశ పరీక్షలను రాష్ట్రాలే నిర్వహించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.
యూపీఎస్సీ తరహాలో స్వయం ప్రతిపత్తి..
చెన్నమల్ల చైతన్య మాట్లాడుతూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి యూపీఎస్సీ తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, భద్రత పెరుగుతుందన్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్, గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై విమర్శలు ఎదుర్కొన్న నాయకులు ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన నాయకులు నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లింగంపల్లి నాగరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పరుశురాం గౌడ్, మ్యాక వినోద్, లింగంపల్లి శ్రీనివాస్, భాసవేణి రాజేందర్, నూతి సాయి చరణ్, పుసాల పవన్, చింతరెడ్డి జైపాల్ రెడ్డి, ఎండీ రజి, ఎండీ హుస్సేన్, బండ అశోక్, ఎండి సాల్మ, జంగా అపర్ణ, అతహర్, పొన్నం శిరీష, కొలిపాక గౌతమి, శారద, ఆసియా సుల్తానా పాల్గొన్నారు.

