epaper
Monday, February 23, 2026
epaper

న‌గ‌రంలో ‘పెళ్లి’ మోసాలు.. అప్ర‌మ‌త్తంగా లేకుంటే అంతే సంగ‌తి!

క‌లం, వెబ్ డెస్క్‌: దోపిడీకి మోస‌గాళ్లు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసాలు, చోరీల‌తో పాటు కొత్త త‌ర‌హా చీటింగ్‌కు పాల్ప‌డుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మైన ‘పెళ్లి’ని త‌మ దోపిడీకి వేదిక‌గా మార్చుకుంటున్నారు. హైదరాబాద్‌ (Hyderabad)లో పెళ్లి పేరుతో యువతులను చీట్ చేస్తున్న కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేవలం ప్రేమ పెళ్లిల్లే కాదు.. పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనూ మోసాలు (Marriage Frauds) జ‌ర‌గ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ సమస్యపై నగరంలో షీ టీమ్స్‌కు ఫిర్యాదులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో యువ‌తులు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ న‌గ‌ర సీపీ స‌జ్జ‌నార్ (Sajjanar) ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు.

ఈ త‌ర‌హా కేసుల్లో మోసగాళ్లు ముందుగా సంప్రదాయబద్ధంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారు. ఆపై ఇక‌ పెళ్లి ఖాయమైంది కదా అని అమ్మాయిల‌తో మాటలు క‌లుపుతున్నారు. అమ్మాయిల‌ను శారీర‌కంగా వాడుకుంటున్నారు. త‌మ అవ‌స‌రాల‌న్నీ తీర్చుకొని అమ్మాయిల్ని ఎమోష‌న‌ల్‌గా బ‌ల‌హీనంగా మారుస్తున్నారు. ఇక పెళ్లి ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి అద‌న‌పు క‌ట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటామ‌ని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఒక వేళ అడిగినంత డబ్బు ఇవ్వకుంటే పెళ్లి రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇక అమ్మాయిలు, త‌మ కుటుంబ‌స‌భ్యులు పెళ్లి ఆగిపోతే పరువు పోతుంద‌న్న భయంతో అడిగినంత డ‌బ్బులు ఇచ్చేస్తున్న సంద‌ర్భాలూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటున్న‌ది సాధార‌ణ కుటుంబాలే కాబ‌ట్టి ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని షీ టీమ్స్ హెచ్చరిస్తోంది. ఈ త‌ర‌హా పరిస్థితుల్లో మౌనంగా ఉండడం స‌రికాద‌ని, బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ స‌మ‌స్య‌ను తెలియ‌జేయాల‌ని సూచిస్తోంది. అలాగే నిశ్చితార్థం అయినా, పెళ్లి పీటలు ఎక్కేవరకు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు చెప్తున్నారు. పెద్ద‌లు కుదిర్చిన సంబంధం అయినా పెళ్లి తంతు పూర్త‌య్యే వ‌ర‌కు హ‌ద్దుల్లో ఉండాలంటున్నారు. పెళ్లికి ముందు ఏకాంతంగా క‌ల‌వొద్ద‌ని, అస‌భ్య‌క‌ర‌మైన సంభాష‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని, ఆర్థిక‌ప‌ర‌మైన సంబంధాలు కూడా మొద‌లుపెట్ట‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

డబ్బు డిమాండ్, బ్లాక్ మెయిల్ వంటివి చేస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాల‌న్నారు. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు నిర్భ‌యంగా త‌మ‌ను సంప్ర‌దించాల‌ని, అమ్మాయిలు, వారి కుటుంబ వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ ఫోన్ చేయాల‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్న మోస‌గాళ్ల‌ను శిక్షిస్తే మ‌రొక‌రికి అన్యాయం జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>