Mobile Popup Ad
Mobile Popup Ad

నష్కల్‌లో మద్యం విక్రేతలకు భారీ షాక్

కలం, జనగామ : జనగామ(Jangaon) జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో (Nashkal Village) అక్రమంగా మద్యం విక్రయిస్తున్న (Illegal Liquor Sales) ఆరుగురి ఇళ్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. గ్రామాన్ని సంపూర్ణ మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామసభలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నష్కల్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. అక్రమంగా మద్యం విక్రయించే వారికి రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్ వంటి ప్రభుత్వ సౌకర్యాలను నిలిపివేయాలని గ్రామసభలో తీర్మానించారు. ఈ నిర్ణయం అనంతరం గ్రామంలోని బెల్ట్ షాప్ నిర్వాహకులలో చాలామంది మద్యం విక్రయాలు నిలిపివేశారు.

అయితే, కొందరు వ్యక్తులు రహస్యంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నట్లు గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. దీనిపై అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురిని గుర్తించి, వారి ఇళ్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. ఈ సందర్భంగా నష్కల్ గ్రామ సర్పంచ్ శాతబోయిన రాజు మాట్లాడుతూ, గ్రామాన్ని పూర్తిగా మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. గ్రామస్థుల సహకారంతో మద్యం విక్రయాలు, మద్యం సేవను నిర్మూలించేందుకు కఠిన చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. గ్రామసభ తీర్మానాన్ని ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులోనూ ఇదే తరహా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. గ్రామసభ తీసుకున్న నిర్ణయాల అమలులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>