కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన 11 ఎకరాల భూమిని కాపాడినట్లు హైడ్రా (HYDRAA) ప్రకటించింది. మార్కెట్లో ఈ భూముల విలువ రూ. 1650 కోట్లు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో 2 ఎకరాలు పార్కు కోసం కేటాయించినది కాగా.. 5 ఎకరాలు శ్మశానవాటికకు మరో 4 ఎకరాలు డంప్ యార్దుకు చెందిన స్థలమని హైడ్రా అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సెంట్రల్ పార్కు కాలనీలో పార్కు కోసం 2 ఎకరాలు కేటాయించారు. సర్వే నంబరు 110/1 లో 148 ప్లాట్లతో 16 ఎకరాల మేర సెంట్రల్ పార్కు కాలనీ ఫేజ్-1 పేరుతో 1998లో లే ఔట్ వేశారు. ఇందులో 2 ఎకరాలను పార్కు కోసం కేటాయించగా.. మున్సిపల్ అధికారులు పార్కు స్థలంగా హద్దులు నిర్ధారించి ప్రహరీ కూడా నిర్మించారు. ఇలా పార్కు కోసం కేటాయించిన భూమి తమదంటూ కొంతమంది ఆక్రమణలకు పాల్పడినట్లు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి 2 ఎకరాల పార్కు స్థలంగా నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం పార్కులో తాత్కలికంగా వేసిన షెడ్డులను తొలగించారు. 2 ఎకరాల పార్కు స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
ప్రగతి నగర్‌లో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా:
ప్రగతినగర్‌లోని అంబీర్ చెరువుకు (Amber Cheruvu) ఆనుకుని ఉన్న 5 ఎకరాల శ్మశానవాటికతో పాటు.. ఆ పక్కనే ఉన్న 4 ఎకరాల డంపింగ్ యార్డు ఆక్రమణలకు గురవుతున్నాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టిన హైడ్రా (HYDRAA).. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విచారించింది. కూకట్‌పల్లి మండలంలోని బాగామేరి విలేజ్ సర్వే నంబరు 103లో ఉన్న ఈ భూమిని శ్మశానవాటికకు, చెత్త డంపింగ్ యార్డుకు చెందిన స్థలంగా గుర్తించింది. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు 9 ఎకరాల భూమి చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 5 ఎకరాలలో శ్మశాన వాటిక స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ఉన్న 4 ఎకరాల్లో ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. భూమిని కబ్జాల పాలవ్వకుండా కాపాడిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. స్కూటీ డిక్కీలోంచి రూ.8 లక్షలు చోరీ
Follow Us On: Sharechat

