కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో కారులో ఒంటరిగా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) స్పందించారు. జరిమానా వార్తల ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించారు. కారులో ఒక్కరే ప్రయాణించినంత మాత్రాన ఎలాంటి జరిమానా విధించబోమని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో కొత్త జరిమానా అమల్లోకి వచ్చిందని, కారులో సింగిల్ గా జర్నీ చేసే వారికి ఫైన్ విధిస్తారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నగర ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని వాహనదారులకు పోలీసులు (Hyderabad Traffic Police) సూచించారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సామాజిక మాధ్యమాలను అనుసరించాలి కోరారు. ట్రాఫిక్ సంబంధిత సందేహాలు, వివరాల కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని వెల్లడించారు.

