కలం, వెబ్ డెస్క్: నైని కోల్ బ్లాక్ టెండర్లపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సోమవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని, వెంటనే నైని కోల్ బ్లాక్ టెండర్లపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉందని, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
‘‘కాంట్రాక్టు సైట్ విజిట్ అనే విధానం నైని బ్లాక్‌లో (Naini Coal Block Tender) పెట్టారు అందుకే టెండర్ రద్దు చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. కానీ గతంలో ఎప్పడు కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం అనేది రాష్ట్రం, దేశంలో ఎక్కడా లేదు. ఈ కాంట్రాక్టు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తెచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ విధానంలో మొదటి బెనిఫిషియరీ రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీ షోదా కన్‌స్ట్రక్షన్‌కే మొదటి టెండర్ దక్కింది’’ అని హరీష్ రావు ఆరోపించారు.
‘‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా సింగరేణి టెండర్లు వేయడానికి సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే విధానాన్ని తెచ్చింది. అంటే టెండర్ వేయాలంటే తప్పకుండా సైట్ విసిట్ సర్టిఫికెట్ అవసరం. దీంతో టెండర్లు ఆన్‌లైన్‌లో వేయకుండా కాంట్రాక్టర్లు సైట్‌కు వెళ్లి చూసి సింగరేణి నుండి ఈ సర్టిఫికెట్ పొందాలి. ఇలా టెండర్లు ఎవరు వేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముందే తెలుసుకున్నాడు. తర్వాత వారిని భయబ్రాంతులకు గురిచేసి టెండర్లు రద్దు చేసుకోవాలని బెదిరిస్తున్నాడు’’ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.


