బండరాయి పడి పిల్లర్ విరిగినా.. చెక్కుచెదరని స్వామివారి విగ్రహాలు!

కలం, ఖమ్మం బ్యూరో: పుణ్యక్షేత్రం భద్రాచలంలో (Bhadrachalam) శుక్రవారం ఓ అద్భుతం, పెను ప్రమాదం ఒకేసారి చోటుచేసుకున్నాయి. రంగనాయకుల గుట్టపై జరుగుతున్న నిర్మాణ పనుల నిర్లక్ష్యం కారణంగా ఓ భారీ బండరాయి కిందకు దూసుకొచ్చి, దిగువన ఉన్న విగ్రహాల మండపం పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి పిల్లర్ విరిగిపోయినప్పటికీ, అక్కడే కొలువుదీరి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహాలకు ఎలాంటి హాని కలగకుండా చెక్కుచెదరకపోవడం చూసి భక్తులు రామయ్య మహిమగా భావిస్తున్నారు.

​భక్తుల విరాళాలతో రంగనాయకుల గుట్ట(Ranganayakula Gutta)పై శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అధికారులు నూతన కాటేజీ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ పనులు జరుగుతున్న సమయంలో గుట్టపై నుంచి ఒక పెద్ద బండరాయి ఒక్కసారిగా అదుపుతప్పి కిందకు దొర్లిపడింది. వేగంగా కిందకు దూసుకొచ్చిన ఆ బండరాయి, గుట్ట దిగువన ఉన్న అంబ సత్రం ముందు భాగంలోని శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాల షెడ్డు పిల్లర్‌ను బలంగా తాకింది. రాయి తగలడంతో షెడ్డు పిల్లర్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది.

​అయితే, బండరాయి కిందకు రాలిపడిన సమయంలో అంబ సత్రం పరిసరాల్లో గానీ, విగ్రహాల షెడ్డు వద్ద గానీ మనుషులు, భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. షెడ్డు పిల్లర్ దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహాలు చెక్కుచెదరకుండా ఉండటంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ​నిత్యం భక్తుల రద్దీ ఉండే రంగనాయకుల గుట్టపై భారీ నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు అధికారులు కనీస భద్రతా చర్యలు, రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి అపశృతి చోటుచేసుకుందని, తక్షణమే పనుల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : “అధికార అహంకారంతో మాట్లాడొద్దు”.. సీఎం కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>